వృషకర్మకు చైతూ కెరీర్లోనే భారీ డీల్!
అక్కినేని నాగచైతన్య(akkineni naga chaitanya) హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వృషకర్మ (Vrushakarma) పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. విభిన్నమైన కథాంశం, భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాకు కార్తీక్ దండు(Karthik dandu) దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ(Sparsh Srivastava) కీలక పాత్రలో కనిపించనున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వెలువడింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ వృషకర్మను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు(Dil Raju)కు చెందిన ఎస్వీసీ(SVC) సంస్థ రిలీజ్ చేయనుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఆయన భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. నాగచైతన్య కెరీర్లోనే భారీ ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైన సినిమాగా ఇది నిలిచినట్లు తెలుస్తోంది. మరోవైపు, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ చైతన్య కెరీర్లో కొత్త రికార్డు నమోదైనట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు సినిమాపై ఉన్న బిజినెస్ ఇంట్రెస్ట్ ను స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల చిత్ర బృందం నిర్వహించిన సెట్ విజిట్‌లో పాల్గొన్న మీడియా ప్రతినిధులు ప్రొడక్షన్ వర్క్స్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. భారీ స్థాయి సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. నాగచైతన్య ఈ సినిమాతో కొత్త మైల్ స్టోన్ ను అందుకోవాలని కష్టపడుతుండగా, వృషకర్మ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.








