సైబర్ మోసాలకు చెక్: డిజిటల్ చెల్లింపులపై బ్యాంకుల కీలక ప్రతిపాదనలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు, నకిలీ కాల్స్, డీప్‌ఫేక్ ఐడెంటిటీలు, బెదిరింపులతో జరుగుతున్న ఆర్థిక నేరాలు (Cyber Crimes) కూడా విపరీతంగా ఎక్కువవుతున్నాయి. అమాయకులైన బ్యాంక్ కస్టమర్లు క్షణాల్లో లక్షలాది రూపాయలు కోల్పోతున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయి. పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి, వినియోగదారుల ఆర్థిక భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఒక ముసాయిదా చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రానికి స్పందిస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులు ఒక కీలకమైన, వినూత్నమైన ప్రతిపాదనను ఆర్బీఐ ముందు ఉంచాయి. డిజిటల్ లావాదేవీల వేగాన్ని కాపాడుతూనే, మోసాలను అడ్డుకునేలా ఈ సరికొత్త విధానాన్ని బ్యాంకులు సూచించాయి.
బ్యాంకులు చేసిన తాజా ప్రతిపాదన (Cyber Crimes) ప్రకారం, యూజర్లు ఎప్పుడైనా పీ2పీ (పర్సన్ టు పర్సన్) లావాదేవీలు చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లో ఒక అదనపు భద్రతను ఏర్పాటు చేయాలి. ఖాతాలో డబ్బులు జమ అయ్యేముందు యాప్ స్క్రీన్‌పై ఒక ‘కన్ఫర్మేషన్ ప్రాంప్ట్’ (Yes/No ఆప్షన్) కనిపిస్తుంది. యూజర్ ఆ లావాదేవీ సరైనదేనని నిర్ధారించుకుని ‘యెస్’ (Yes) అని ఎంచుకుంటే తక్షణమే డబ్బులు అవతలి వ్యక్తి ఖాతాలో జమవుతాయి. ఒకవేళ అనుమానం వచ్చి ‘నో’ (No) అని నొక్కితే లావాదేవీ రద్దవుతుంది. ఒకవేళ యూజర్ ఎలాంటి స్పందనా ఇవ్వకపోతే, ఆ లావాదేవీని వెంటనే రద్దు చేయకుండా గంట ఆలస్యంగా ఆటోమేటిక్‌గా ఎదుటివ్యక్తి ఖాతాలో క్రెడిట్ అయ్యేలా ఈ సరికొత్త కన్ఫర్మేషన్ విధానాన్ని పకడ్బందీగా రూపొందించారు.
అయితే యూపీఐ వేగాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు బ్యాంకులు ఒక షరతు విధించాయి. రూ. 10,000 దాటిన ప్రతి సాధారణ లావాదేవీకి ఈ ‘యెస్-నో’ ప్రాంప్ట్‌ను అడగకూడదని బ్యాంకులు భావిస్తున్నాయి. రోజువారీ డిజిటల్ వినియోగానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండటానికి, కేవలం ‘అసాధారణ’ లేదా ‘సందేహాస్పద’ చెల్లింపులకు మాత్రమే ఈ ప్రాంప్ట్‌ను పరిమితం చేయాలని స్పష్టం చేశాయి. ఉదాహరణకు, తెల్లవారుజామున 2 గంటల సమయంలో అసాధారణంగా పెద్దమొత్తంలో డబ్బులు పంపడం, లేదా కస్టమర్ తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ లావాదేవీ జరపని ఒక సరికొత్త అనుమానాస్పద ఖాతాకు సడన్‌గా భారీగా డబ్బులు (Cyber Crimes) ట్రాన్స్ఫర్ చేయడం వంటి సందర్భాల్లో మాత్రమే ఈ అదనపు వెరిఫికేషన్ అడుగుతారు. ప్రతి చిన్న లావాదేవీని గంటసేపు నిలిపివేయడం వల్ల యూజర్లు అసహనానికి గురై, మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళనతో బ్యాంకులు ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని చాలా వ్యూహాత్మకంగా సూచించాయి.
మరోవైపు దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను, యూపీఐ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మాత్రం లావాదేవీలలో నిధుల జమను వాయిదా వేయడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని అత్యధిక శాతం కస్టమర్లు ఇప్పటికే వేగంగా, క్షణాల్లో జరిగే యూపీఐ చెల్లింపులకు పూర్తిగా అలవాటుపడ్డారని ఎన్పీసీఐ గుర్తుచేసింది. ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉండే కఠినమైన జాప్య నిబంధనలను మనం అనుకరించాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఎన్పీసీఐ అభిప్రాయపడింది. పైగా సైబర్ నేరాల్లో (Cyber Crimes) ఎక్కువగా పేయర్, పేయీ ఇద్దరూ చేతులు కలిపి ముందుగానే ఏర్పాటు చేసుకునే ‘మ్యూల్ అకౌంట్ల’ ద్వారా జరుగుతున్నాయని, ఇలాంటి మోసాలను నివారించడంలో ఈ గంట సమయం వాయిదా ఏ రకంగానూ సహాయపడదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. డిజిటల్ పేమెంట్ స్పీడ్ ఏమాత్రం దెబ్బతినకుండా, సైబర్ దొంగలను సాంకేతికంగా ఎలా కట్టడి చేయాలనే కీలక అంశంపై ప్రస్తుతం ఆర్బీఐ, బ్యాంకులు, ఎన్‌పీసీఐల మధ్య చర్చ నడుస్తోంది.








