వారికి మాత్రం వీసా నిబంధనలు కఠినం చేసిన అమెరికా
చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) సభ్యులు, వారి కుటుంబాలకు వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. శుక్రవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. వీటి ప్రకారం… ట్రావెల్ వీసాకు నెలరోజుల పాటే గడువు ఉంటుంది. వీసా జారీ చేసిన 30 రోజుల్లోగా దానిని వినియోగించనట్లయితే రద్దైపోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రావెల్ వీసా తప్ప ఇమ్మిగ్రేషన్, ఉద్యోగ వీసాలకు కొత్త విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. సీసీపీ యునైటెడ్ వర్క్ ఫ్రంట్ డిపార్ట్మెంటుతో కలిసి పనిచేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారికే ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.






