ఇలాంటి విషయాల్లో భారత్ కు ఎప్పుడూ మద్దతు : అమెరికా
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్బ్ బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదరించి, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రుబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్ బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారు.






