అమెరికా నూతన అధ్యక్షుడి .. ప్రమాణం అప్పుడే
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. కచ్చితమైన ఎలక్టోరల్ క్యాలెండర్ను అనుసరించాల్సిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈ సారి నవంబరు 5వ తేదీన జరగనుంది. అయితే విజయం సాధించిన వారు జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. వాస్తవానికి ఇది చాలా సుదీర్ఘ సమయం. ఈ సంప్రదాయం వెనక చాలా కారణాలున్నాయి. తొలుతు నవంబరులో ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం మార్చి 4వ తేదీన జరిగేది. అంటే దాదాపు నాలుగు నెలల సమయం. అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నుంచి ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఉన్న సమయాన్ని దాదాపు మూడు నెలలకు కుదించారు. దీనికి సంబంధించిన సవరణను 1933లో తీసుకొచ్చారు. దాని ప్రకారం జనవరి 20న నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరుగుతుంది.






