శతాబ్దాలైనా ఆమెకు అమెరికా పీఠం దూరమే!
అమెరికా మహిళా అధినేతకు దూరంగానే ఉంటోంది. 248 ఏళ్ల ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటివరకూ వుమన్ ప్రెసిడెంట్ పాలన లేదు. ఈ అగ్ర పీఠం కోసం కొందరు మహిళలు పోటీ పడినప్పటికీ విజయ తీరాలను చేరుకోలేకపోయారు. తాజాగా భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓవల్ ఆఫీస్‌కు దూరంగానే ఉండిపోయారు. అమెరికాలో ఓటు హక్కు పొందేందుకే మహిళలు అనేక ఏళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. 1920లో అమెరికా మహిళలకు ఓటు హక్కు లభించినప్పటికీ అది కొందరికే పరిమితమైంది. ఏళ్ల పోరాటం అనంతరం చివరకు 1960లలో అన్ని వర్గాల మహిళలకు అమెరికాలో ఓటు హక్కు దక్కింది. ఈ క్రమంలో రాజకీయ చైతన్యం పొందినవారు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధ్యక్ష పీఠానికి దగ్గర కాలేకపోతున్నారు.






