Joe Biden: బైడెన్ హయాంలోని వలసదారులకు ట్రంప్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జో బైడెన్ (Joe Biden) హయాంలో తాత్కాలిక నివాస అనుమతులు పొందిన వలసదారులకు ఆయన షాకిచ్చారు. వారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ( డీహెచ్‌ఎస్) ఆదేశాలిచ్చింది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (US Customs and Border Protection) అభివృద్ధి చేసిన సీబీపీవన్ యాప్ (CBP One App) ద్వారా 2023 జనవరి నుంచి 9 లక్షల మంది అమెరికాలోకి ప్రవేశించారు. ఆ యాప్‌లో నమోదు చేసుకున్నవారు అధ్యక్షుడి ప్రత్యేక అనుమతితో రెండేళ్లపాటు అగ్ర దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. అమెరికా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు జాతీయ భద్రత కోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఈ పెరోల్ (Parole) ను రద్దు చేస్తున్నాం అని డీహెచ్‌ఎస్ (DHS) తాజాగా వెల్లడించింది. సీబీపీవన్ యాప్ ద్వారా లబ్ది పొందిన వారికి తొలగింపు నోటీసులు అందించామని తెలిపింది. అదే యాప్ ద్వారా స్వచ్ఛందంగా స్వీయ బహిష్కరణ చేసుకోవాలని సూచించింది. అయితే ఎంతమందికి ఆ నోటీసులు వెళ్లాయో తెలియ రాలేదు. బైడెన్ హయాంలో ఈ విధానంలో 9 లక్షల మందిపైగా అమెరికా వచ్చారు.