ఆ దేశాలపై నిషేదాజ్ఞలు పునరుద్ధరించండి : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచన చేశారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమెరికా సురక్షితంగా ఉంచేందుకు ముస్లిం దేశాల నుంచి ప్రయాణాలపై నిషేధాన్ని పునరుద్ధరించాలని జో బైడెన్‌ను డొనాల్డ్ ట్రంప్ కోరారు. పలు దేశాల ప్రయాణికులు అమెరికాలో ప్రవేశించకుండా, శరణార్థులపై గతంలో తాను విధించిన ఆంక్షలను అమలులోకి తీసుకురావాలని సూచించారు. తీవ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఆన్లైన్లో నియమాకాలు చేస్తారని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం నుంచి అమెరికాను దూరంగా ఉంచేందుకు స్మార్ట్, కామన్సెన్స్ నియమాలను కలిగి ఉండాలన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ సహా పలు ముస్లిం దేశాల నుంచి ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ నిషేధాన్ని ఎత్తివేశారు.






