అధికార మార్పునకు చకచకా అడుగులు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆ బాధ్యతల స్వీకరణకు వీలుగా అధ్యక్ష భవనం శ్వేతసౌధంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. తద్వారా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచే నూతన పరిపాలన యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని, కొత్త ప్రభుత్వంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపికైన సుజీవైల్స్ వెల్లడిరచారు. ఎన్నికైన మంత్రులు, అధికార మార్పు ప్రక్రియను సవ్యంగా నిర్వహించేందుకు ప్రతి శాఖలో అవసరమైన బృందాల నియామకానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. ఈ అధికార మార్పు బృందం గతంలో మాదిరిగా జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) సమకూర్చే ప్రభుత్వ భవనాలను, సాంకేతికతను వినియోగించుకోదని, పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయాలనేదే తమ ఉద్దేశమని వైల్స్ వివరించారు. ఖర్చులకు ప్రైవేటు నిధుల సేకరణ చేపడుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.






