Biden :జబ్బార్ వెనక ఎవరి హస్తమూ లేదు : బైడెన్
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడికి పాల్పడిన షంషుద్దీన్ జబ్బార్(Shamshuddin Jabbar) వెనక ఎవరి హస్తమూ లేదని, అతను సొంతంగా ఈ చర్యకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వెల్లడిరచారు. దుండగుడు ఐసిస్ మద్దతుదారుడని తెలుస్తోందన్నారు. మాజీ సైనికోద్యోగి అయిన జబ్బార్ రద్దీగా ఉన్న బూర్బోన్ వీధిలో ఒక ట్రక్కును జనంపైకి నడపడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ సైతం మృతి చెందాడు. ఈ ఘటనను ఉగ్రదాడిగా పరిగణించిన ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తు ప్రారంభించింది. ఈ దాడి వెనక ఇంకొకరి ప్రమేయం ఉన్నట్లు తెలిపే సమాచారమేదీ లభించలేదని ఎఫ్‌బీఐ తనకు వివరించింది. నిందితుడు ట్రక్కును జనంపైకి నడపడానికి కొన్ని గంటల ముందు ఫ్రెంచి క్వార్టర్ ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో ఐస్ కూలర్లలో పేలుడు పదార్థాలు అమర్చాడు. అంతేకాకుండా తీవ్రవాద సంస్థ ఐసిస్‌కు మద్దతుగా వీడియోలు విడుదల చేశాడు. ఈ దాడితో విదేశీ, స్వదేశీ సంస్థలకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. న్యూ ఆర్లీన్స్ దాడికి, లాస్ వేగాస్‌లో జరిగిన పేలుడుకు సంబంధం ఉందా అన్న విషయంపైనా దర్యాప్తు కొనసాగుతోంది అని బైడెన్ తెలిపారు.






