Rafael Caro: డ్రగ్ లార్డ్ క్వింటెరో అమెరికాకు తరలింపు

డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలన్న ట్రంప్ (Trump) యంత్రాంగం ఒత్తిళ్లు మెక్సికో ప్రభుత్వం పై పనిచేశాయి. యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (డీఈఏ) అధికారి హత్య కేసులో ఆరోపణలున్న కరుడుగట్టిన డ్రగ్స్ ముఠా నాయకుడు రఫేల్ కారో క్వింటెరో (Rafael Caro Quintero) సహా 29 మంది మాఫియా ముఖ్యులను మెక్సికో (Mexico) ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. మాదక ద్రవ్యాల మాఫియా ముఖ్యులను తమకు అప్పగించకుంటే అన్ని రకాల మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించక తప్పదన్న ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలతో మెక్సికో ప్రభుత్వ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సహకరించేందుకు ముందుకు రావడం గమనార్హం.
మెక్సిలోలోని వేర్వేరు జైళ్లలో ఉన్న డ్రగ్స్ మాఫియా (Drug mafia) పెద్దతలలను రాజధాని మెక్సికో సిటీలో విమానాలకు ఎక్కించారు. మొత్తం 29 మందిని అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాల్లోని జైళ్లకు తరలించారు. వీరిలో అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆరు గ్రూపులకు గాను ఐదు గ్రూపులకు చెందినవారు ఉన్నారు. కారో క్విటెరోతోపాటు సినలోలా కార్టెల్‌లోని రెండు గ్రూపులకు చెందిన ముఖ్యులు, 2022లో నార్త్ కరోలినా (North Carolina )లో పోలీసు అధికార హత్య కేసులో నిందితుడొకరు ఇందులో ఉన్నారని మెక్సికో అధికారులు వెల్లడిరచారు.