ప్రధాని నరేంద్ర మోదీకి… అమెరికా ఉపాధ్యక్షురాలు ఫోన్

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. భారత్‍కు లక్షలాది కరోనా వ్యాక్సిన్ డోసులను పంపాలన్న అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాన్ని మోదీకి ఆమె తెలియజేశారు. అమెరికా సహకారంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం, వ్యాపారులు, ప్రవాస భారతీయులు ప్రకటించిన సంఘీభావానికి వరుస ట్వీట్లలో మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా నుంచి ఈ నెలాఖరుకు భారత్‍కు మొదటి బ్యాచ్ డోసులు రానున్నాయి. కాగా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు ముందుగా 1.90 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. తొలి విడుతలో కేటాయించిన 2.5 కోట్ల డోసుల్లో 75 శాతానికి తమ నిల్వల నుంచి ఒకేసారి పంపిస్తామన్నారు. జూన్ నెలాఖరు కల్లా 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందజేస్తామన్నారు.