ట్రావెల్స్ పై అమెరికా మళ్లీ నిషేధం
బ్రిటన్, బ్రెజిల్, ఈయూ దేశాల అమెరికేతర ప్రయాణికులపై ఆంక్షలు
బ్రిటన్, బ్రెజిల్, ఐర్లాండ్, కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాల అమెరికేతర ప్రయాణికులపై మళ్లీ నిషేధం విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారని వైట్‌హౌస్ అధికారి ఒకరు చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజున చెప్పినట్టుగానే కరోనా మహమ్మారిపై తీవ్రస్థాయి పోరాటానికి బైడెన్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభమయిపోయింది.
ఐరోపా దేశాల ప్రయాణికుల మీదే కాదు, దక్షిణాఫ్రికాకు రాకపోకలు సాగించే అమెరికేతర ప్రయాణికుల మీద కూడా బైడెన్ ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రయాణికులకు ఈ ఆంక్షలు పూర్తిగా వర్తిస్తాయి. దక్షిణాఫ్రికాలో కూడా కొత్తరకం కరోనా మహమ్మారి అవతరించి, వందలాది మందిని కబళిస్తోందనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికాలో వ్యాపించిన ఈ కొత్త రకం వైరస్ అమెరికాకు కూడా సోకిందని, ఇది వ్యాపించకుండా ఉండేందుకే బైడెన్ ఈ ఆంక్షలు విధించారని వైట్‌హౌస్ అధికారి ఒకరు వివరించారు.
దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని బైడెన్ గత వారం మాస్కులు ధరించడానికి సంబంధించిన నిబంధనలను కఠినం చేశారు. అమెరికాకు వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్‌పై పోరాటానికి ఆయన అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలో 4,20,000కు చేరుకున్న కరోనా మృతుల సంఖ్య వచ్చే నెల నాటికి అయిదు లక్షలు దాటుతుందని, ఈ పరిస్థితి రాకుండా ఉండాలన్న పక్షంలో కొన్ని కఠిన చర్యలు తప్పవని బైడెన్ స్పష్టం చేశారు.
”ప్రస్తుతం మనం జాతీయ ఎమర్జెనీ లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కనీసం మనం దాన్ని ఆ విధంగా పరిగణించక తప్పదు” అని ఆయన అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలంలో కూడా బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ దేశాల ప్రయాణికులపై ఆంక్షలు ఉండేవి. అయితే, ఆ ఆంక్షలను ఎత్తేయాలని ట్రంప్ తన పదవీ కాలం చివరి రోజుల్లో నిర్ణయించుకున్నారు. అయితే, గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నామని, జనవరి 26 నుంచి ఆంక్షలను కొనసాగిస్తున్నామని బైడెన్ ప్రకటించారు.
చైనా నుంచి వచ్చే అమెరికేతర ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ట్రంప్ గత ఏడాది జనవరి 31న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వైరస్ చైనా ద్వారా సంక్రమిస్తోందనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి 14న ఈ నిషేధాన్ని ఆయన ఐరోపా దేశాలకు కూడా విస్తరించారు. అప్పటికి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అందజేసిన వివరాల ప్రకారం, కరోనా వైరస్ వ్యాపించడం ప్రారంభమైన తర్వాత అమెరికాలో సుమారు 2.5 కోట్ల మంది ఈ వైరస్ బారినపడ్డారు.
కాగా, అమెరికాలో ఇంతవరకూ 4,00,000 మందిని కరోనా పొట్టనబెట్టుకున్నట్టు గణాంకాలు తెలియజేయడంతో ఈ సుసంపన్న, శక్తివంతమైన దేశం ఈ మహమ్మారి వల్ల బాగా దెబ్బతిన్నదని, మృతుల సంఖ్య విషయంలో ఒక ఆందోళనకర స్థాయికి చేరుకుందని అర్థమైంది.
కరోనాపై పోరాటానికి సర్వశక్తులూ వినియోగించాలని, దీనికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని బైడెన్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా దేశాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి సుమారు 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని ప్రకటించి, దీనికి కాంగ్రెస్ వెంటనే ఆమోదం ప్రకటించాలని అభ్యర్థించారు. ఇందులో కొన్ని కోట్ల డాలర్లను కరోనా వైరస్‌పై పోరాటానికి, వ్యాక్సిన్ పంపకానికి ఉద్దేశించారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన బైడెన్ తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, వంద రోజుల పాటు అమెరికా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.






