నా మొదటి సంతకం దానిపైనే : బైడెన్
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి అని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల పాటు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ తాను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో తొలి సంతకం చేస్తానని వెల్లడించారు. పదవి చేపట్టిన తొలిరోజు తాను అమెరికా ప్రజలను వంద రోజుల పాటు ఫేస్ మాస్క్ ధరించాలని కోరతానని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాల గవర్నర్స్, నగరాల మేయర్లను కూడా భాగస్వామ్యం చేస్తానన్నారు.
నా పాలనలో మొదటి 100 రోజులు ప్రతి అమెరికన్ మాస్క్ ధరించాలని కోరుతాను. కేవలం 100 రోజులు మాస్క్ ధరించడం వల్ల ఫలితం ఏంటో మీరే గమనిస్తారు. ఇదే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తొలి సంతకం చేస్తాను. నా సంతకంతో ఇది ప్రారంభం అవుతుంది. దీనిని సాధించడం కోసం రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లతో కలిసి పని చేస్తాను అని బైడెన్ అన్నారు. ఇప్పటికే తన అడ్మినిస్ట్రేషన్‌కు కూడా కొవిడ్ 19 మహమ్మారిపై పోరుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ఇక అగ్రరాజ్యంలో విలయతాండవం చేస్తున్న కరోనా ఇప్పటివరకు కోటిన్నర మందికి సోకగా, 2.86 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అందుకే సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయబోతున్నామని బైడెన్ వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, వ్యక్తిగత శుభ్రత ఎంతో అవసరమని తెలిపారు.






