భారతీయులపై.. జో బైడెన్ ప్రశంసలు
భారతీయ సంతతి ప్రజలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. భారతీయ అమెరికన్లు అమెరికా దేశానికి గర్వకారణంగా మారినట్లు తెలిపారు. నాసాలో జరిగిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంజినీర్ డాక్టర్ స్వాతి మోహన్‌పై ప్రశంసలు కురిపించారు. అంగారక గ్రహంపై పర్సీవరెన్స్ రోవర్ దిగిన నేపథ్యంలో నాసా శాస్త్రవేత్తలతో బైడెన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇటీవల అమెరికా ప్రయోగించిన పర్సీవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో ఇంజినీర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు చేపట్టారు. రోవర్ ల్యాండింగ్ మిషన్‌కు కంట్రోల్ ఆపరేషన్స్ ఆమె సారథ్యంలోనే సాగాయి. ఈ సందర్భంగా నాసా సమావేశంలో బైడెన్ భారతీయ ఇంజినీర్‌ను విశేషంగా కొనియాడారు.
భారత సంతతి ప్రజలు అమెరికాలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన గత 50 రోజుల్లో బైడెన్ ప్రభుత్వం సుమారు 55 మందికి కీలక పదవులను అప్పగించింది. ప్రభుత్వంలోని ప్రతిశాఖలోనూ భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. అమెరికాలో స్థానికుల కన్నా భారతీయులే రాణిస్తున్నారని, నాసా ఇంజినీర్ స్వాతి మోహన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డిని ఆయన మెచ్చుకున్నారు.






