కమలాహారిస్‌కే భారతీయ అమెరికన్ ల మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ఈ క్రమంలో వెలువడిన తాజా సర్వేల్లో భారతీయ అమెరికన్ల మద్దతు డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కే ఉందని వెల్లడైంది. 61 శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపే ఉన్నారని ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే వెల్లడించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 31 శాతం మంది మద్దతు ఉందని తెలిపింది. యూగవ్, కార్నేగి ఎండౌమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. ఇండియన్ అమెరికన్ల మద్దతు హారిస్‌కే ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది డెమోక్రాటిక్ పార్టీకి ప్రతికూల అంశమే. ఎందుకంటే 2020 నాటి ఎన్నికల నాటితో పోల్చుకుంటే డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థికి వారి మద్దతు తగ్గింది. అప్పట్లో జో బైడెన్‌కు 68 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. అదే సమయంలో ట్రంప్‌నకు 22 శాతం మంది మాత్రమే మద్దతివ్వగా, తాజాగా ఆ సంఖ్య 31 శాతానికి పెరగడం గమనార్హం. డెమోక్రాట్లుగా గుర్తింపు పొందే భారతీయ అమెరికన్ల సంఖ్య 56 శాతం నుంచి 47 శాతానికి తగ్గింది. అలాగే ఆ పార్టీ వైపు మొగ్గు చూపేవారి సంఖ్య 66 శాతం నుంచి 57 శాతానికి పడిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతోన్న తొలి భారతీయ అమెరికన్ అయిన కమలకు ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవే. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు.






