అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి
అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి లభించింది. అమెరికా జాతీయ భద్రతా మండలిలో పనిచేస్తున్న కష్పటేల్ తాజాగా రక్షణ శాఖ మంత్రి క్రిస్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ ప్రకటించింది. ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ వేటు వేసిన మార్క్ ఎస్పర్ స్థానంలో మిల్లర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన తొలి కీలక నియామకం ఇది. కాగా ఇప్పటివరకూ రక్షణ మంత్రికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న జెన్ స్టివార్ట్ రాజీనామా చేశారు.
కష్ పటేల్ పూర్వీకులకు గుజరాత్ మూలాలు ఉన్నాయి. కానీ ఆయన పుట్టిపెరిగింది న్యూయార్లో. తన అసలు పేరు కశ్యప్ ప్రమోద్ పటేల్. తండ్రిది ఉగాండా కాగా తల్లిది టాంజానియా. వారు 1970లో కెనడా నుంచి అమెరికాకు వలస వచ్చారు. న్యాయ విద్య పూర్తి చేసిన 39 ఏళ్ల పటేల్ గతేడాది నుంచి జాతీయ భద్రతా మండలిలోని ఉగ్రవాద నిరోధక డైరెక్టరేట్‌కు సీనియర్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.






