కొత్త చట్టంతో హెచ్-1బీ, ఎల్-1 వీసాల ప్రక్రియ కఠినతరం..!
హెచ్-1బీ, ఎల్-1 వీసాల ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని అమెరికా భావిస్తోంది. భ్రష్టు పట్టిన ఇమిగ్రేషన్ వ్యవస్థను మార్చేందుకు కొత్త చట్టాన్ని చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెనెటర్లు చక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ కలిసి ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం అమెరికన్ వర్కర్లు, వీసాదారులకు మరింత భద్రత దొరుకుతుందని, విదేశీ ఉద్యోగుల రిక్రూట్మెంట్లో పారదర్శకత పెరుగుతుందని ఈ సెనెటర్లు చెప్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీయులను తీసుకొచ్చి పెట్టే ఛాన్స్ లేకుండా ఈ కొత్త చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. హెచ్-1బీ, ఎల్-1 వీసా సంస్కరణ చట్టంతో భ్రష్టు పట్టిన అమెరికా ఇమిగ్రేషన్ విధానం మెరుగవుతుందని కొందరు అంటున్నారు.
అర్హత కలిగిన అమెరికన్ ఉద్యోగులను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించడం, విదేశీ ఉద్యోగుల ఎక్స్‌ప్లాయిటేషన్, అమెరికన్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ చేయడం తదితర సమస్యలకు ఈ చట్టంతో చెక్ పెట్టాలని తాము భావిస్తున్నామని సెనేట్ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ డర్బిన్ స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాల్లో ఎక్స్పర్టుల అవసరం అయితే.. అలాంటి వారిని విదేశాల నుంచి తెచ్చుకునేందుకు కంపెనీలు హెచ్-1బీ వీసాలు ఉపయోగించుకుంటాయి. అలాగే వేరే దేశంలో తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులను అమెరికాకు తెప్పించుకోవడానికి ఎల్-1 వీసా ఉపకరిస్తుంది. వీటితోపాటు చట్టంలోని కొన్ని లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకొంటున్న కొన్ని కంపెనీలు అడ్డదార్లు తొక్కుతున్నాయని, అమెరికా ఉద్యోగాలను విదేశీయులకు అంటగడుతున్నాయని కొందరు నేతలు వాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏటా ఎన్ని హెచ్-1బీ, ఎల్-1 వీసాలు ఇస్తున్నారనే విషయంపై యూఎస్ పౌరసత్వం, ఇమిగ్రేషన్ సర్వీసుల శాఖ ఫోకస్ పెడుతుందని గ్రాస్లే తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా అమెరికాలో స్టెమ్ అడ్వాన్స్డ్ డిగ్రీలు పొందిన విద్యార్థులకు హెచ్-1బీ వీసాల్లో ప్రాధాన్యం దక్కేలా చూస్తుందని, అలాగే మిగతా యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్లకు కూడా ప్రాధాన్యం దక్కేలా చేస్తుందని ఈ ప్రకటనలో గ్రాస్లే పేర్కొన్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానాన్ని హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులతో భర్తీ చేయడాన్ని ఈ చట్టం ఏమాత్రం అంగీకరించదు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కంపెనీలపై ఈ చట్టం బాగా ప్రభావం చూపుతుందట. ఉద్యోగులకు అమెరికాలో ట్రైనింగ్ ఇచ్చి, స్వదేశాలకు వెళ్లిన తర్వాత కూడా అదే పని చేయిస్తున్న అమెరికన్ కంపెనీల పప్పులు ఈ చట్టం ముందు ఉడకవని తెలుస్తోంది. కనీసం 50 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో సగం మంది హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉంటే.. ఇక ఆ కంపెనీ అదనంగా హెచ్-1బీ, ఎల్-1 ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకుండా చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు.






