Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇక లేరు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter ) ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జార్జియా (Georgia) రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యుల మధ్యే ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడు. 1977-81 మధ్య ఆ పీఠంపై ఉన్నారు. ఇప్పటిదాకా అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా పనిచేసినవారిలో అత్యధిక కాలం జీవించింది ఈయనే. రెండు నెలల కిందటే కార్టర్ వందేళ్లు పూర్తిచేసుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు-జాక్, చిప్, జెఫ్, అమీ ఉన్నారు. భార్య రోసాలిన్ 96 ఏళ్ల వయసులో నిరుడు మరణించారు. కార్టర్ డెమోక్రాటిక్ పార్టీ నేత. 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. భారత్తో కార్టర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) , త్వరలో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర(Donald trump) సంతాపం వ్యక్తం చేశారు.






