రాజకీయంగా తనను అణచివేయడానికే ఈ కుట్ర : ట్రంప్
రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికలపరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొకాట్లు అబద్దాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఏం చెబితే మన్హట్టన్ జ్యూరీ అదే చేస్తోందని అని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ తరపు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.






