అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని.. స్వదేశాలకు సాగనంపుతా : ట్రంప్
పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలను చేపట్టిన విదేశీ విద్యార్థులను అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు పంపించేస్తానని రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. న్యూయార్క్ లో జరిగిన రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో దాతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారి ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటారని హెచ్చరించారు. నేను ఒక పని చేస్తాను. ఏ విద్యార్థి అయినా దేశంలో ఆందోళనలు చేస్తే, వారిని అమెరికా బయటకు సాగనంపుతాను. మీకు తెలుసు ఆ ఆందోళనల్లో చాలా మంది విదేశీ విద్యార్థులున్నారు. అతి త్వరలోనే వారు తమ ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటున్నారని అన్నారు.
ఈ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు ఏదో ఒక రోజు అమెరికాలో రాజ్యాంగ పదవులు చేపట్టవచ్చని ఓ దాత ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి ట్రంప్ స్పందిస్తూ నిరసనలను అణచివేస్తానని పేర్కొన్నారు. గాజా యుద్దం విషయంలో ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ దేశం పోరాడుతోందని మెచ్చుకొన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆందోళనలను అణచివేసిన పోలీస్ శాఖను ట్రంప్ అభినందించారు. వీటిని ఇప్పుడే అడ్డుకోవాలన్నారు. తనను ఎన్నుకొంటే 25-30 ఏళ్ల నాటి పరిస్థితిని మళ్లీ తీసుకొస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.






