స్వలింగ సంపర్కుల హక్కులను కాపాడుతాం.. బైడెన్ ప్రభుత్వం హామీ
వాషింగ్టన్ః విదేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల హక్కులను కాపాడడానికి తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆయన తన విదేశాంగ విధానంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ల హక్కులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఇంత సాహసం మరే ప్రభుత్వమూ చేయకపోవడం గమనించాల్సిన విషయం.
2011లో అప్పటి అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ వర్గాల విషయంలో తలపెట్టిన కొన్ని కార్యక్రమాలను బైడెన్ తిరిగి చేపట్టడమే కాకుండా, ఈ వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెంటనే రద్దు చేశారు. ఒబామా తీసుకున్న చర్యలను మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొద్దిగా సవరించాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు తదితర వర్గాల హక్కులను కాపాడడంలో అమెరికా ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలను మరింతగా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.
ఆయన విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతూ, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, బైసెక్సులర్, ఇంటర్సెక్స్ (ఎల్.జి.బి.టి.ఐ.క్యు) వగైరా వర్గాలవారి హక్కులకు మద్దతునివ్వడానికి, వారిని కాపాడడానికి, ప్రోత్సహించడానికి, వారిలో తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి విదేశాల్లో ఉన్న అమెరికా ప్రభుత్వ సంస్థలన్నీ చురుకుగా, చిత్తశుద్ధిగా పాటుపడాలని సూచించారు. అంతేకాక, దీనికి సంబంధించి అధికారులు 180 రోజుల లోగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన ఆదేశించారు.
”మనుషులందరి పట్ల సమాన గౌరవమర్యాదలతో వ్యవహరించాలి. వారు ఎవరైనప్పటికీ, వారు ఎవరిని ప్రేమించినప్పటికీ వారితో నిర్భయంగా వ్యవహరించాలి” అని ఆయన స్పష్టం చేసినట్టు ఒక ప్రకటన తెలియజేసింది.
భారీగా ఆర్థిక సహాయం
దేశంలో ప్రవేశించే శరణార్థుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్న బైడెన్ ప్రభుత్వం స్వలింగ సంపర్కులు తదితర వర్గాలవారి హక్కుల విషయంలోనూ ఇదే చిత్తశుద్ధితో, నిబద్ధతతో వ్యవహరించదలచుకుంది. ఈ వర్గాలకు చెందినవారు తమ తమ దేశాల నుంచి భయంతో పారిపోయినప్పుడు లేదా దాక్కున్నప్పుడు, లేదా ఆశ్రయం కోరినప్పుడు అటువంటి కేసుల్లో బాధితులను వెంటనే ఆదుకోవాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇతర దేశాల్లో ఈ వర్గాల పట్ల ఉన్న వివక్షను తొలగించడానికి, వారిని గుర్తించి, సమాన హక్కులను కల్పించే చట్టాలను రూపొందించడానికి అమెరికా కృషి చేస్తుందని, లైంగిక స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ వర్గాలవారి హక్కుల కోసం పోరాడుతున్న స్వదేశీ, విదేశీ సంస్థలకు ఇతోధికంగా ఆర్థిక సహాయం చేయాలని కూడా ఆయన సూచించారు.
కాగా, ఈ వర్గాలవారి సమస్యలను పరిశీలించి, పరిష్కరించడానికి, వివిధ విదేశీ సంస్థల మధ్య సమన్వయానికి ఒక ప్రత్యేక దౌత్యాధికారిని నియమించాలని విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ భావిస్తున్నట్టు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. దీనిని బట్టి, స్వలింగ సంపర్కులు తదితర వర్గాలవారి సమస్యలకు బైడెన్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తున్నదీ అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
స్వలింగ సంపర్కులు తదితర వర్గాల హక్కులకు సంబంధించి వివిధ దేశాలలో అమలవుతున్న పద్ధతులు, ప్రక్రియలను అమెరికా ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, అవసరాన్ని బట్టి ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకు రావడం జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. స్వలింగ సంపర్కాన్ని శిక్షార్హం చేసినందుకు ఉగాండా, నైజీరియా, గాంబియా వంటి కొన్ని ఆఫ్రికా దేశాలపై అమెరికా గతంలో ఆంక్షలు విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్, ఇంటర్సెక్స్ అసోసియేషన్ అందజేసిన వివరాల ప్రకారం, దాదాపు మూడు వంతుల దేశాలలో ఈ వర్గాలపై ఎటువంటి ఆంక్షలూ లేవు. అక్కడ స్వలింగ సంపర్కం చట్టబద్ధమైనదే. ఇక 28 దేశాలలో స్వలింగ వివాహాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.






