”ఇక రాజీనామా చేయండి” ట్రంప్ హయాం నాటి అటార్నీలకు బైడెన్ ప్రభుత్వ ఆదేశాలు
అధికారం మార్పులో భాగంగా జో బైడెన్ ప్రభుత్వం ఇక తమ తమ పదవులకు రాజీనామాలు సమర్పించాల్సిందిగా ట్రంప్ కాలం నాటి ప్రభుత్వ లాయర్లను అభ్యర్థించింది. అయితే, ఇది డెలవేర్‌లోని చీఫ్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ డేవిడ్ వీస్‌కు మాత్రం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు సంబంధించిన పన్నులపై దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల, ఆ దర్యాప్తును డేవిడ్ వీస్ పర్యవేక్షిస్తున్నందువల్ల ఈ రాజీనామా అభ్యర్థన ఆయనకు వర్తించదని ఆ వర్గాలు వివరించాయి.
మాజీ అటార్నీ జనరల్ విలియమ్ బ్రార్ నియమించిన కనెక్టికట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జాన్ దుర్హామ్కు కూడా ఈ ఆదేశాలు వర్తించవు. రష్యా దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరుపుతున్నందువల్ల, ఆ వ్యవహారం పూర్తయ్యే వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.
”న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను పునరుద్ధరించడానికి, న్యాయ వ్యవస్థపై ఏ విధమైన అవాంఛనీయ, అనవసర ప్రభావం ఉండకుండా ఉండడానికి” వీస్, దుర్హామ్ల రాజీనామాలు కోరలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు.
”న్యాయ వ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షిస్తామంటూ బైడెన్ చేసిన వాగ్దానానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆయన సందేశం పంపారు. దాని ప్రకారమే అంతా జరుగుతోంది” అని జెన్ సాకి వివరించారు.
న్యాయ వ్యవస్థను ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ ఎన్నికల ప్రచారంలో బైడెన్ పదే పదే ఆరోపించారు. రానున్న కొద్ది వారాలలో ఈ మార్పు వ్యవహారమంతా పూర్తవుతుంది. ట్రంప్ అధికారానికి రాగానే కొద్ది గడువు కూడా ఇవ్వకుండానే అధికారులను మార్చిన విషయం తెలిసిందే.
అప్పట్లో దీనిపై ట్రంప్ న్యాయ శాఖ అధికారులకు, ఒబామా నియమించిన ఒక న్యాయాధికారికి మధ్య ఘర్షణ తలెత్తింది. మాన్హాటన్లోని అమెరికా అటార్నీ ప్రీత్ బరారా తాను రాజీనామా చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో ఆ అటార్నీని బలవంతంగా ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు చీఫ్ ప్రాసిక్యూటర్లో కొనసాగాల్సిందిగా బరారాను అంతకు ముందు ట్రంప్ కోరడం జరిగింది.
అటార్నీ జనరల్‌గా మెరిక్ గార్లెండ్, డిప్యూటీ అటార్నీ జనరల్‌గా లీసా మొనాకోల నియామకాన్ని సెనేట్ ఇంకా ఖాయం చేయనప్పటికీ బైడెన్ ప్రభుత్వం కొన్ని మార్పులను చేపడుతూనే ఉంది. ఈ ఇద్దరు అధికారులతో పాటు మరికొందరు న్యాయాధికారుల నియామకం కూడా ఆమోదం కోసం నిరీక్షిస్తోంది.
ఈ పదవులు ఖాయం అయ్యేలోగా ఆపద్ధర్మ అటార్నీ జనరల్ మాంటీ విల్కిన్సన్, డిప్యూటీ అటార్నీ జనరల్ జాన్ కార్లిన్ న్యాయ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ ఇద్దరినీ బైడెన్ గత నెలలో నియమించింది.
”సాఫీగా, సజావుగా మార్పిడి జరగాలని మేం కోరుకుంటున్నాం. అమెరికా అటార్నీ అభ్యర్థులను సెనేట్ ధ్రువీకరించే వరకూ అమెరికా అటార్నీ శాఖలో ఉన్న తాత్కాలిక, ఆపద్ధర్మ అధిపతులు న్యాయ వ్యవహారాల అమలుకు చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తుంటారు. అందరికీ నిష్పక్షపాతంగా న్యాయం అందేటట్టు చూస్తుంటారు” అని విల్కిన్సన్ స్పష్టం చేశారు.
కాగా, కొందరి నియామకాలు అధ్యక్షుడి ఆమోదం కోసం నిరీక్షిస్తున్నాయి. దేశంలోని 93 చీఫ్ పెడరల్ ప్రాసిక్యూటర్ పదవుల్లో మూడోవంతు పదవులకు బైడెన్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ప్రస్తుతం అవన్నీ ఆపద్ధర్మ అధికారులతో నడుస్తున్నాయి.






