భారత సంతతికి చెందిన మరో ఇద్దరు మహిళలకు కీలక పదవులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి అమెరికన్లకు ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా భారత సంతతికి చెందిన మరో ఇద్దరు మహిళలకు బైడెన్ తన ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమించారు. ఐక్యరాజ్యసమితిలో సోహినీ చటర్జీ, ఆదిత్య గొరూర్ అనే ఎన్నారైలు అమెరికాకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఐరాసలో అమెరికా రాయబారికి సోహినీ చటర్జీ సీనియర్ సలహాదారుగా పని చేస్తారు. ఇటీవలి వరకు ఆమె కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేశారు. అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లోనూ ఇంతకుముందు సేవలందించారు. జో బైడెన్ హయాంలో అమెరికా-భారత మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సోహినీ చటర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక అంశాల్లో అదితి గోరూర్ నిపుణురాలు. ఆమె భారతదేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్లో పని చేశారు. మెల్బోర్న్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, జార్జిటౌన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. సిమ్సన్ సెంటర్లో పని చేశారు. వాషింగ్టన్లోని ఆసియా ఫౌండేషన్ అండ్ సెంటర్ ఫర్ లిబర్టీ, మెల్బోర్న్ యూనివర్సిటీలో లా స్కూల్లో పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. అదితి గోరూర్ అమెరికా రాయబారికి సలహాదారుగా సేవలందిస్తారు.






