బుమ్రాకు వికెట్లు దక్కకపోవడానికి కారణం అదే..!
ఐపీఎల్లో(ipl) ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(bumrah) వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. బుమ్రా ప్రదర్శనపై జరుగుతున్న చర్చను తప్పుబట్టాడు. బుమ్రా వికెట్లు తీయలేకపోవడానికి కారణం అతని బౌలింగ్ వైఫల్యం కాదని, బ్యాటర్లు బూమ్రాను ఎదుర్కోవడానికి భయపడటమేనని అశ్విన్ విశ్లేషించాడు.
“బుమ్రా ఓవర్లలో భారీ షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడం కంటే, సింగిల్స్ తీసి తక్కువ రన్ రేట్‌తో గడిపేయాలని బ్యాటర్లు భావిస్తున్నారు. రిస్క్ తీసుకోకపోవడం వల్లే బూమ్రాకు వికెట్లు దక్కడం లేదు” అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కేవలం వికెట్ల సంఖ్యను చూసి బుమ్రా ఫామ్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదని అశ్విన్ హితవు పలికాడు. బుమ్రా వికెట్లు తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడని, అది ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతుందని గుర్తు చేశాడు.
బూమ్రా వేసే డాట్ బాల్స్ వల్ల ఇతర బౌలర్లకు వికెట్లు దక్కే అవకాశం లభిస్తుందని, ఇది జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకమని అశ్విన్ వివరించాడు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, విమర్శలు చేసే ముందు అతని గత రికార్డులను గమనించాలని అశ్విన్ సూచించాడు. మ్యాచ్ గమనాన్ని మార్చగలిగే సామర్థ్యం బుమ్రాకు ఉందని, త్వరలోనే బూమ్రా వికెట్ల ఖాతా తెరుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే బుమ్రా పునరాగమనం కీలకం.
ఇవి కూడా చదవండి








