హైదరాబాద్ లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నివాస గృహాల అవసరాలు మారుతున్నాయి. ఒకప్పుడు రక్షణ రంగానికి, భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు నిలయంగా ఉన్న నార్త్ సెంట్రల్ హైదరాబాద్ ఇప్పుడు పచ్చని వాతావరణం, ఆధునిక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుత కనెక్టివిటీతో శరవేగంగా ఐటీ, ప్రీమియం నివాస హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక రంగాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. నగరం పరిధి దాటి విస్తరిస్తున్నా, మరోవైపు రీ-డెవలప్మెంట్ రూపంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు సైతం సరికొత్త లగ్జరీలతో కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి.
నగరానికి పశ్చిమంలో కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నార్సింగి వంటి ప్రాంతాలున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ దిగ్గజ కంపెనీల విస్తరణ, అల్ట్రా-లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడి వృద్దికి ప్రధానం. అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, గ్లోబల్ లైఫ్‌స్టైల్ అత్యంత ఎక్కువ మూలధన వృద్ధిని, స్థిరమైన అద్దె ఆదాయాన్ని అందిస్తున్నాయి. కొంపల్లి, బాచుపల్లి, దూలపల్లి, మేడ్చల్.. ఇక్కడ ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44), జీనోమ్ వ్యాలీ ఐటీ-ఫార్మా కారిడార్ ఉండడం ఇక్కడి వృద్ధికి కారణం. తక్కువ ధరల్లో లగ్జరీ విల్లాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉండడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు ఇటువైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, పోచారం, నాగోల్.. వంటి ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన గ్రిడ్ విధానంతో ఈస్ట్ జోన్లో నూతన ఐటీ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైలు సదుపాయం విస్తృతంగా ఉండటంతో రీసేల్ మార్కెట్, మిడ్-సెగ్మెంట్ హౌసింగ్ గణనీయంగా పుంజుకుంది. శంషాబాద్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం.. వంటివి ఈ ప్రాంత రియల్టీ వృద్ధికి కీలకం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆదిబట్ల ఏరోస్పేస్/డిఫెన్స్ పార్క్, లాజిస్టిక్స్ హబ్‌లు ఇందులో భాగమయ్యాయి. విశాలమైన ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్రాజెక్టులు, ఫార్మా రంగానికి అనువైన వాతావరణం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారాయి.
మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీలు, సొంత ఇంటి కల ఉన్న కుటుంబాలు నగర నడిఒడ్డున ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్ బెల్ట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు, లగ్జరీ హైరైజ్ ప్రాజెక్టులతో సరికొత్త వెలుగులు సంతరించుకుంటోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, నాంపల్లికి, అసెంబ్లీకి లేదా ఐటీ కారిడార్లకు చేరుకోవడం చాలా సులభం. గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్ అందుబాటులో ఉండటం వల్ల నగరంలోని ఏ మూలకైనా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రతి 2-3 నిమిషాలకు నగరంలోని అన్ని దిక్కులకూ ఆర్టీసీ బస్సు సర్వీసులు లభిస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యార్హతల కోణంలో ఇక్కడ ఇల్లు కొనడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలోనే దాదాపు అన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దాంతోపాటు ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం అతి సమీపంలో ఉంది. సివిల్స్, గ్రూప్స్, నీట్/జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రధాన కేంద్రాలన్నీ (అశోక్ నగర్, చిక్కడపల్లి) ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు అనుకొని ఉండటంతో విద్యార్థులకు, కుటుంబాలకు ఇది సరైన నివాస ప్రాంతంగా తోస్తుంది.
ఐటీ నిపుణులకు మెట్రో ద్వారా మైండ్ స్పేస్, హైటెక్ సిటీలకు సులభమైన ప్రయాణ మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వ్యాపార సంస్థలు, చుట్టుపక్కలే ఉండటంతో నిత్యం ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటోంది. ఐకానిక్ సినిమా థియేటర్ల కాంప్లెక్స్‌లకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిలయం. కిమ్స్, యశోధ, సన్‌షైన్, నిమ్స్.. వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 10-15 నిమిషాల ప్రయాణ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్ లగ్జరీ బ్రాండ్ రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు సమీపంలో ఉంది. గతంలో ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్లు లేదా చిన్న అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండేవి. కానీ, పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి దిగ్గజ బిల్డర్లు ఇక్కడి స్థలాలను సేకరించి అల్ట్రా-లగ్జరీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. క్లబ్‌హౌస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన పార్కులు, 100 శాతం వాస్తు అనుకూలతలు, ట్రిపుల్ లెవల్ పార్కింగ్ సదుపాయాలతో కూడిన భవనాలు ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడ ఆస్తుల విలువ నిలకడగా భారీగా పెరుగుతోంది.
ఒకప్పుడు బాలానగర్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ పరిశ్రమలకు ప్రసిద్ధి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఆజాద్ ఇంజనీరింగ్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి. అయితే నగరీకరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం పారిశ్రామిక యూనిట్లను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించింది. దీంతో బాలానగర్‌లోని పారిశ్రామిక స్థలాలు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల పునర్నిర్మాణానికి అనువుగా మారాయి. పచ్చని పార్కులు, పర్యావరణ అనుకూల వసతులతో ఈ ప్రాంతమిప్పుడు కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు చిరునామాగా మారింది. నార్త్ సెంట్రల్ హైదరాబాద్‌లో నివసించే వారికి ఏ ప్రాంతానికైనా సులువుగా చేరుకునేలా కనెక్టివిటీ ఉండటం అతిపెద్ద వరం. నగరంలోని ప్రధాన ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీ, లైఫ్ సైన్సెస్ రంగానికి కేరాఫ్ అడ్రస్ అయిన జీనోమ్ వ్యాలీకి కూకట్పల్లి–బాలానగర్ అత్యంత సమీపంలో ఉంది. కైత్లాపూర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మాదాపూర్, హైటెక్ సిటీలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. అలాగే బాలానగర్ మెట్రో స్టేషన్ ద్వారా ఇక్కడ్నుంచి హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, హెచఐసీసీలకు వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. నగర కేంద్రంలో ఉండటం వల్ల కూకట్పల్లి వై జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లకు చేరుకోవడం సులభం.
ఎన్‌హెచ్–44 , ఔటర్ రింగ్ రోడ్ ద్వారా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణం.
ప్రపంచ స్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో బాలానగర్ ప్రాంతం అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తోంది. ఇంటికి చేరువలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉండటంతో పిల్లలకు పాఠశాలకు వెళ్లే ప్రయాణ సమయం తగ్గి చదువుపై దృష్టి పెట్టడానికి, తల్లిదండ్రులకు భద్రతా భావం కలగడానికి తోడ్పడుతుంది. అలాగే అంతర్జాతీయ ఆసుపత్రులూ ఈ ప్రాంతంలో ఉండటంతో అధునాతన వైద్య పరిజ్ఞానం, వైద్య నిపుణులతో సమగ్ర చికిత్స ఇక్కడే అందుబాటులో ఉంది.
భూముల వేలంలో రికార్డులు
హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో 5.38 ఎకరాల మల్టీయూజ్ (వాణిజ్య, నివాస) భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆన్లైన్ వేలం వేయగా. ఎకరానికి రూ.269 కోట్లు పలికింది. ఇది దేశంలోనే ప్రభుత్వ వేలంలో నమోదైన అత్యధిక రికార్డు ధరల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా 5.38 ఎకరాల 2 ప్లాట్ ఎకరాకు రూ.269 కోట్ల ధర పలకడంతో ప్రభుత్వానికి మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు జరిగిన ప్లాట్ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల ధర లభించి, రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో రెండు వేలాల్లో కలిపి 10.63 ఎకరాల భూమికి రూ.2,833.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర రావడం, రిజర్వ్ ధర కంటే 52.3 శాతం అధికంగా ఉండటం విశేషం.
ఐటీ, వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రాయదుర్గ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతంలో భూములకు మంచి విలువ ఉంటుందని పెట్టుబడిదారులు ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కేపీహెచ్‌బీకి క్రేజ్ ఎలా ఉందో కూడా మరోసారి రుజువైంది. ఇటీవల నిర్వహించిన కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. రికార్డు స్థాయి ధరలకు భూములు అమ్ముడయ్యాయి. ఇక్కడ చదరపు గజం భూమి గరిష్టంగా రూ.2.70 లక్షల పలికింది. కెపిహెచ్బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించింది. ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు.








