కేదార్‌పురి పునర్నిర్మాణ పథకం
హిమాలయ పర్వత పంక్తుల్లోని కేదారిపురిని పునర్నిర్మించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇక్కడ చేపట్టిన తొలిదశ పునర్నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్రేట్ మంగేశ్ ఘిల్దియాల్ చెబుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 12వేల అడుగుల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది. ‘చార్‌థామ్’ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌కు ప్రతిరోజూ సుమారు 5,000 మంది యాత్రికులు వస్తుంటారు. ఏటా మే నుంచి అక్టోబర్ వరకూ ఈ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంటుంది. నాలుగేళ్ల క్రితం ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడడంతో కేదార్నాథ్ ఆలయం, పరిసర ప్రాంతాల్లోని కట్టడాలు దాదాపు తుడిచి పెట్టుకుపోయాయి. వందలాది భవనాలు ధ్వంసం కావడంతో అప్పట్లో దాదాపు 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కేదార్నాథ్ క్షేత్రాన్ని పునర్నిర్మించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్రంలో, కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గత నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ప్రస్తుత శీతాకాలంలో ఆలయాన్ని మూసివేయడానికి ఒక్కరోజు ముందు ప్రధాని కేదార్‌నాథ్‌లో పర్యటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా సుమారు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అయిదు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ‘కేదార్‌పురి పునర్నిర్మాణ పథకం’ కింద ఈ అయిదు ప్రాజెక్టులను చేపడతారు.













