ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా మోనోరైళ్లు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రెండు మోనో రైళ్లు ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి అతి సమీపంలో ఆగిపోయాయి. భారీ ప్రమాదం తప్పిందంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజికమాధ్యమాల్లో నెటిజన్లు షేరు చేస్తున్నారు. డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంటున్నారు.
చెంబూరు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఒకే ట్రాక్‌పైకి రెండు మోనో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఆగిపోయాయి. అయితే సోషల్‌మీడియాలో రకరకాల వదంతులతో ఈ ఘటన వైరల్‌గా మారిపోయింది. చివరకి దీనిపై ముంబయి మోనోరైల్ అధికారులు వివరణ ఇచ్చారు. రైళ్లు ఒకదానికొకటి ఎదురుగా రాలేదని చెప్పారు. సాంకేతికలోపం కారణంగా ఓ రైలు ట్రాక్‌పై నిలిచిపోయిందని, అందులో ఉన్న ప్రయాణికులను అక్కడి నుంచి తరలించేందుకు మరో రైలు అక్కడికి వెళ్లిందని వివరణ ఇచ్చారు. ‘చెంబూరు ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యతో మోనో రైలు చాలా సేపటివరకు నిలిచిపోయింది. అయితే స్టేషన్‌కు సమీపంలోనే ఆగిపోవడంతో ప్రయాణికులను సురక్షితంగా రైలు నుంచి దించేందుకు సహాయక చర్యలు చేపట్టాం. ఆ సమయంలో అదే ట్రాక్‌పైకి సహాయకచర్యలు చేపట్టేందుకు మరోరైలు దానికి దగ్గరగా వచ్చి నిలిచింది’ అని మోనో రైలు ప్రతినిధులు వెల్లడించారు.
మోనోరైలులో తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జూన్ 2011లో నిర్మాణ పనుల సమయంలో 60 టన్నుల దిమ్మె కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. జులై 2012లో మోనోరైలుకు సంబంధించి ఓ కట్టడం పైకప్పు కూలి శిథిలాల కింద ఆరుగురు చిక్కుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.













