సీఎం కేజ్రీవాల్ పై మూడు ఎఫ్ ఐఆర్‌లు..!!
పీడబ్ల్యూడీ కుంభకోణానికి సంబంధించి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం దిల్లీ న్యాయస్థానానికి తెలియజేశారు. ప్రజాపన్నుల వ్యవహారశాఖలో అవకతవకలకు పాల్పడినట్లు సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురిపై క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్, ఆయన బంధువుపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన రాహుల్శర్మపై గురువారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన దానిపై విచారణ జరపాల్సిందిగా మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్ర ఏసీబీ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించారు.
మూడు ఎఫ్ఐఆర్లను మే 8న నమోదు చేసినట్లు ఏసీబీ న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని జూన్ 8లోగా నివేదిక రూపంలో అందజేయాల్సిందిగా న్యాయస్థానం ఏసీబీని ఆదేశించింది. 2015లో దిల్లీలో రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణాల కాంట్రాక్ట్‌లను కేజ్రీవాల్ సహకారంతో అడ్డగోలుగా అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. రాహుల్ శర్మ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు పలువురిపై దాడులు చేశారు.













