ఒకసారి 1963లోకి వెళదాం. సరదాగా
అప్పట్లో తమిళనాట 15 మంది సభ్యులు గల డీఎంకే పార్టీ 50 మంది సభ్యులయి కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోతూంటే అప్పటికే 9 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నిజాయితీపరుడు, నిష్కల్మష్కుడైన కామరాజ్ నాడార్ పార్టీ భవిష్యత్ కోసం కలవరపడ్డారు. ఆనాటి ప్రధాని జవహర్‌లాల్‌కు సీనియర్ రాజకీయవేత్తలంతా పదవుల నుంచి వైదొలగి పార్టీ కోసం పనిచేయాలంటూ సూచన చేసి, తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగుతానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, నెహ్రూ తనదైన రాజకీయాన్ని తాను నడిపారు. తన మంత్రివర్గంలో ప్రధాని పదవి మీద కన్నువేసిన కొందరు సీనియర్ మంత్రులను, కొందరి పనితీరు నచ్చనివారిని వైదొలగించుకోవడం కోసం వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రధాని పదవికి తాను రాజీనామా చేసి మిగతా అందరి చేత చేయించారు. అయితే ప్రధానిగా మీరే వుండాలంటూ ఇతర సభ్యులంతా కోరేసరికి, యధాప్రకారం రాజీనామా ఉపసంహరించుకొని, మొరార్జీదేశాయ్, ఎస్.కె.పాటిల్, లాల్‌బహుదూర్ శాస్త్రి, జగ్జీవన్‌రామ్, బి.గోపాలరెడ్డి, శ్రీమాలి లాంటి ఆరుగురు కేబినెట్ మంత్రుల చేత, మద్రాసు, ఒరిస్సా, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, కాశ్మీర్ ముఖ్యమంత్రులంతా చేసిన రాజీనామాలను ఆమోదింపచేసారు. ఈ కథ మొత్తంలో నెహ్రూకూ ఓ స్వార్థ రాజకీయ ప్రణాళిక ఉంది. శాస్త్రిగారు మినహా మిగతా మంత్రులందరినీ వదిలించుకోవాలని నెహ్రూకు అభిలాష ఉన్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కామరాజ్ చేత ఆయన పథకాన్ని ప్రకటింప చేసి (కామరాజ్ పథకం) తన కోర్కెను నెహ్రూ సాధించుకున్నారు.













