రాహుల్‌గాంధీ మాటలను నిజం చేసిన వీహెచ్
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభ జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రజాగర్జన సభ నిర్వహణలో మాజీ ఎమ్మెల్మే జగ్గారెడ్డి ఎంతో కష్టపడ్డారని వీహెచ్ రాహుల్‌కు వివరించారు. జగ్గారెడ్డి సొంత డబ్బులు ఖర్చుచేసి సభ నిర్వహించారని చెప్పారు. వీహెచ్ మాటలకు స్పందించిన రాహుల్‌గాంధీ మీరేమీ ఇవ్వలేదా అంటూ వీహెచ్‌ను సరదాగా అడిగారు. నావద్ద డబ్బులు లేవంటూ వీహెచ్ సమాధానమిచ్చారు. మీ చేతికి ఉన్న బ్రేస్లెట్ ఇవ్వొచ్చు కదా అని రాహుల్ చమత్కరించారు. దీంతో వి.హనుమంతరావు తన చేత్రికి ఉన్న బ్రేస్‌లెట్‌ను ఇవాళ జగ్గారెడ్డికి బహుకరించి రాహుల్ మాటలను నిజం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో రాజీవ్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో పడవలో పర్యటిస్తున్న సమయంలో ఆయన వెంట ఉన్న తనను నా కోసం ఏదైనా చేస్తానని తరచూ చెబుతుంటావని ఈ నదిలో దూకుతావా అని సరదాగా ప్రశ్నించగా నదిలో దూకానని తన అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బంగారు బ్రాస్లెట్ను జగ్గారెడ్డి అందజేస్తున్న విషయం త్యాగం కాదని, మంచి సందేశమన్నారు. కార్యకర్తలు, నాయకుల డిమాండ్ మేరకు రాహుల్‌ను మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరతామన్నారు.













