సంక్రాంతి సంబరాల్లో వెంకయ్య నాయుడు
రాజకీయాల్లో వారసత్వాన్ని సమర్థించనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సృష్టం చేశారు. సంప్రదాయాన్ని, సేవాతత్వాన్ని మాత్రమే వారసులకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. తన ఆస్తులను పిల్లలకు కాకుండా స్వర్ణభారత్ ట్రస్టుకే ఇస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముప్పవరపు ఫౌండేషన్ పదో వార్షికోత్సవం, స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పండగలు మన సంస్కృతికి ప్రతీకలన్నారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆస్తిని వారసత్వంగా తీసుకుంటారని.. కానీ, తన పిల్లలు సేవాభావాన్ని స్వీకరించి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నందుకు గర్విస్తున్నానని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆద్యంతం తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శభాకాంక్షలు తెలిపారు.
మా తెలుగు బిడ్డ అని గర్వంగా చెప్పుకోగలిగే వ్యక్తి వెంకయ్యేనని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కితాబిచ్చారు. కుటుంబాన్ని సేవా కార్యక్రమాల్లో మమేకం చేసి వెంకయ్య నాయుడు కొనసాగిస్తున్న కృషి స్పూర్తినిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు సేవలను ప్రతి జిల్లాకు విస్తరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకరిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. వెంకయ్యని కలిసిన ప్రతిసారీ కొత్త విషయం నేర్చుకుంటానని ప్రముఖ పారిశ్రామికవేత్త జి.మల్లికార్జునరావు (జీఎంఆర్) తెలిపారు. వెంకయ్యనాయుడు సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ ఆకాంక్షించారు. ట్రస్టు వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రీయ సేవాసంస్థ నిర్దేశకుడు, గాంధేయవాది జి.మునిరత్నంకు విశిష్ట సేవా పురస్కారంతో పాటు రూ.5 లక్షల చెక్కును వెంకయ్యనాయుడు అందజేశారు.













