తెలంగాణకు మోదీ చేసిందేం లేదు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్య మూలాలను నాశనం చేస్తోందని ఆరోపించారు. మోదీ తిరిగి అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలతో పాటు సీఎంలను సైతం జైలుకు పంపుతున్నారని, దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలను మతపరంగా విడదీసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. దేశ భవిష్యత్తుకు రానున్న పార్లమెంట్ ఎన్నికలే కీలకమన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్న ఆయన.. విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏమయ్యాయని, బయ్యారం, ఐటీఐఆర్‌ను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ.. సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేస్తున్నామని, నీటి, కరెంట్ సమస్యలు ఏ మాత్రం లేకుండా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలను సైతం పార్లమెంటులో వ్యతిరేకించామని, అదే తమ పార్టీ విధానమని చెప్పుకొచ్చారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీతో పోటీ గురించి విలేకరులు ప్రశ్నించగా.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదని, ఆ పార్టీ ఈ ఎన్నికల తర్వాత మిగలదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో ఉండటం వల్లే కాంగ్రెస్‌పై అబద్దపు ప్రచారాలకు దిగుతోందని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. చివరిగా ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న భారీ ఎన్నికల ప్రచార సభ గురించి వివరిస్తూ.. ఆ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.