అందుకే ఒక్క అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వాలి : ఉత్తమ్
ఎవరేం మాట్లాడినా మునుగోడు ఓటర్లు పట్టించుకోరని, కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకోవడం కష్టమని, అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవని ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తానేమీ మాట్లాడనని తెలిపారు. వెంకట్ రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ నేతలు మాట్లాడతారని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదిన్నరేళ్లుగా ఏం చేయలేని పార్టీలు ఇప్పుడేం చేస్తాయని నిలదీశారు. అందుకే ఒక్క అవకాశం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఇవ్వాలని మునుగోడు ప్రజలను కోరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్కు మంచి ఆదరణ ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణలో సుమారు 40 వేలకు పైగా కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలకనున్నారని స్పష్టం చేశారు. రాయచూర్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ ప్రాంతంలోని నది దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తారని తెలిపారు. రాష్ట్రంలో చాలా సామాజిక వర్గాలను కలిసి వారి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారని తెలిపారు.













