‘యూ ట్యాక్స్’ వ్యాఖ్యలపై ఏలేటికి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి తాను వంద కోట్ల రూపాయలు పంపించాననడం పచ్చి అబద్ధమన్నారు. మంగళవారం నాడు మీడియాతో మట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 100 రోజుల్లో రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించామని, అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టామని పేర్కొన్నారు. తాను యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నానంటూ ఏలేటి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అవగాహనా రాహిత్యంతో చేసినవంటూ తిప్పికొట్టారు. ‘‘నాపై ఏలేటి వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. అయితే నేను ప్రస్తుతం పక్క రాష్ట్రంలో దైవదర్శనానికి వచ్చాను. తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యలకు సరైన రీతిలో జవాబిస్తాను’’ అంటూ ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ (రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్) వసూలు చేస్తున్నారంటూ ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘యూ ట్యాక్స్’ అంటూ ఏలేటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.