USA:కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
న్యూయార్క్: అమెరికాలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువతులు రోడ్డు ప్రమాద రూపంలో అనంత లోకాలకు వెళ్లారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోవడం వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24) ఉన్నత చదువులు, ఉపాధి నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడ స్థిరపడి కుటుంబానికి అండగా ఉండాలనుకున్న వారి కలలు కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో కల్లలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చిన్న వయసులోనే ఇద్దరు యువతులు మృతి చెందడంతో గార్ల మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






