తెలంగాణలో భారీగా పెరిగిన… భూముల విలువ

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుంలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‍ను ఆదేశించారు. రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటి వరకు అమలులో ఉన్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ట మార్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీసం ధర రూ.100 నుంచి రూ.200 లకు పెంచింది. అలాగే అపార్ట్ మెంట్ ల ప్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచిన సర్కార్ చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం చొప్పున పెంచినట్లు ఉత్తర్వులో పేర్కొంది.
భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్టంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్, సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు విలువ గరిష్టంగా 50 శాతం పెరగనుండగా ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి.
ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేసిన నివేదికలో అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకొని భూముల విలువను నిర్దారించినట్టు సమచారం. గతంలో ప్రతిపాదనలు రూపొందించినప్పుడు ప్రాంతీయ రింగ్‍రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి రావడంతో దానికి చేరువలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగడాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. విలువలు ఖరారు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.