టీఆర్ఎస్ కు షాక్…. బీజేపీలోకి స్వామి గౌడ్
టీఆర్ఎస్లో ఉద్యమకారులకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక, వారి ఆత్మగౌరవం కోసమే తాను బీజేపీలో చేరినట్లు తెలంగాణ శాసన మండలి మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినా మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన తాను రెండేళ్లలో వందసార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానన్నారు. అయినా ఇవ్వలేదన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తండ్రిలాంటి కేసీఆర్ను వదిలి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం జెండా పట్టని, మాట్లాడని ఇతర పార్టీ నేతలకు అగ్రతాంబూలమిచ్చి ఉద్యమకారులను దూరం పెట్టడం బాధాకరమన్నారు.













