జాతీయ రహదారులపై తెరాస రాస్తారోకో…
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, కొనబోమని మరొకరు.. నూకలు తినాలని ఇంకొకరు.. తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను ముట్టడించాయి. వడ్ల కుప్పలు, వరి గొలుసులతో రైతులు తరలివచ్చి కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు.
నాగ్‌పూర్ జాతీయ రహదారిపై కడ్తాల్, ఆదిలాబాద్ వద్ద, బెంగళూరు జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు వద్ద, విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ వద్ద, ముంబై జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద రాస్తారోకో చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ ప్రాంతాలతోపాటు అనేక చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ‘వడ్లు కొనాలని పోరాటం- రైతు బతుకుల ఆరాటం, పంజాబ్ వడ్లు కొంటరెట్లా.. తెలంగాణ వడ్లు కొనరెట్లా’, బీజేపీ పాలన బలిపీఠం- రైతు బతుకులతో చెలగాటం’, దేశం కోసం ధర్మం కోసం వడ్లు కొనాలి’ అంటూ నినదించారు. రైతులు ఎడ్లబండ్లపై ర్యాలీగా వచ్చి హైవేలను ముట్టడించారు. తెలంగాణ రైతు బతుకుల్లో చీకటి నింపేలా కుట్రలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై గులాబీ శ్రేణులు నిప్పులు చెరిగాయి.













