ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు.. హిందువులమే అయినా
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా హిందువులమే అయినప్పటికీ బీజేపీ చేస్తున్న జై శ్రీరామ్ నినాదాల వల్ల తాము జై శ్రీరామ్ అనలేక పోతున్నామని పేర్కొన్నారు. దేశంపై భక్తి ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి కూడా మున్వన్నెల జెండా ఉండటంతో జాతీయ పతకాన్ని తాము పెట్టుకోలేకపోతున్నామన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్కు లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ విమర్శిస్తోందన్నారు. యూపీలో ఓవైసీపై కాల్పులు జరిగిన తీరును చూస్తే ఎవరితో ఎవరు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారనో అర్థమవుతుందని అన్నారు.
హిజాబ్ వివాదం ఎక్కడ తెలంగాణలో వ్యాపిస్తుందో అన్న ఆందోళన కలుగుతుందన్నారు. బీజేపీ ఓట్ల కోసం స్వార్థబుద్ధితో కర్ణాటకలో హింసను ప్రేరేపిస్తుందని ఆయన ఆరోపించారు. రెండు మతాలకు చెందిన విద్యార్థులు కొట్టుకునే స్థాయికి దిగజార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గొడవ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మొదలైతే హైదరాబాద్లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.













