ఓయూలో విదేశీ విద్యార్థులకు జాగ్రత్తలు
కరోనా వైరస్ నేపథ్యంలోఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం అధికారులు పత్యేక చర్యలు తీసుకున్నారు. వారిని పూర్తిగా హాస్టళ్లలో క్వారంటైన్ చేశారు. తదుపరి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ (యూఎఫ్ఆర్వో) డైరెక్టర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. విదేశీ విద్యార్థుల కోసం తార్నాకలో ఉన్న ప్రత్యేక హాస్టల్లో 57 మంది విద్యార్థులు, లేడీస్ హాస్టల్లోని ఒక బ్లాక్‌లో 19 మంది విద్యార్థినులు ఉన్నారని చెప్పారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందుగానే వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు వెళ్లకుండా పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విదేశీ విద్యార్థులంతా ముందు నుంచీ తమ ఆహారాన్ని వారే వంట చేసుకుని తినడం వలన ఆహారానికి సంబంధించిన ఇక్కట్లు లేవన్నారు.













