అమెరికా ఉద్యోగం వదిలి ఆర్మీలోకి..
అమెరికాలో ఉద్యోగం మంచి జీతం మంచి జీవితం. మరోవైపు ప్రతిష్ఠాత్మక ఐఐఎంలో సీటు ఇవన్నీ వద్దనుకుని మాతృభూమికి సేవ చేయాలనే తపనతో ఆర్మీలో చేరాడో యువకుడు. ఆ యువకుడి పేరు బర్నాన యాదగిరి. అతని తండ్రి రోజు కూలీ. తల్లి కూడా చిన్నాచితకా పనులు చేసుకుంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. ఇటువంటి ఆర్థిక కష్టాల మధ్య స్కాలర్‌షిప్‌లతో చదవుకుంటూ హైదరాబాద్‌లోని ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు యాదగిరి. వెనువెంటనే అమెరికాకు చెందిన ఓ సంస్థ ఉద్యోగం ఆఫర్ చేసింది. క్యాట్‌లో 93.4 పర్సంటైల్ స్కోర్ చేయడంతో ఐఐఎం (ఇండోర్) సీటు ఇచ్చింది. కానీ యాదగిరి వీటిని వదిలేసుకున్నాడు. మనసు చెప్పినట్టు ఆర్మీలో చేరిపోయాడు. విదేశీ ఉద్యోగం చేస్తే ఆర్థిక బాధలు తీరిపోతాయి కదా అని యాదగిరిని ప్రశ్నిస్తే, ఆ ఉద్యోగంతో కేవలం డబ్బే వస్తుందని, ఆత్మసంతృప్తి రాదని చెబుతున్నాడు. మాతృభూమికి సేవ చేస్తే కలిగే ఆత్మసంతృప్తి ముందు ఎన్నికోట్లైనా దిగదుడపేనని అన్నారు.
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌తో యాదగిరి దేశ రక్షణ బాధ్యతలు చేపట్టాడు. ఆర్మీ ఇంజనీరింగ్ యూనిట్ శిక్షణలో భాగంగా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రతిభ కనబరిచిన యాదగిరి ఆర్మీ రజత పతకంతో సత్కరించింది. మా నాన్న అతి నిరాడంబరుడు. నేను సాధారణ సైనికుడిగా ఆర్మీలో చేరుతున్నానేమోనని అనుకున్నాడు. ఇంజనీరింగ్ విభాగంలో చేరుతున్నట్టు ఆయనకు తెలియదు. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదలి ఆర్మీలో చేరి తప్పు చేస్తున్నావని అన్నాడు అని యాదగిరి చెప్పాడు. చదువుకునే రోజుల్లో తన కుటుంబం పడిన ఆర్థిక కష్టాలను గుర్తు చేసుకున్నాడు యాదగిరి. తన తండ్రి 60 రూపాయలకే పనిచేసిన రోజులున్నాయని, పోలియోతో బాధపడే తల్లి కూడా ఆఫీసులో బల్లలు శుభ్రం చేసి చేతనైనంత సంపాదించేదని అన్నాడు. కష్టపడి పనిచేసే తత్వం తన రక్తంలో ఉందని రక్షణ, పరిశోధన విభాగంలో దేశం తలెత్తుకునేలా పనిచేస్తానని అన్నారు.













