సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం : మంత్రి కేటీఆర్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఏదీ లేదని, తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపెట్టారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషనల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి రూ.303 కోట్లలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా అన్నింటినీ బుట్టదాఖలు చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన ఇవ్వకపోయినా కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇదే రీతిలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో సాధించామన్నారు. శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తున్నాం. చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించాం. హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదు. గుజరాత్లో వరదలకు మాత్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు అని అన్నారు.













