కేఆర్ఎంబీ సమావేశానికి హాజరు కానున్న సీఎం కేసీఆర్
సెప్టెంబర్ 1 న జరగబోయే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్ సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కేఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం సూచించారు.













