టీ ఫైబర్ గ్రిడ్ పథకం త్వరలోనే…
ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ-ఫైబర్‌గ్రిడ్ పథకం పైలట్ ప్రాజెక్టు వరల్డ్ ఐటీ కాంగ్రెస్ వేదికగా ఆవిష్కారం కానుంది. సాంకేతిక విప్లవంలో మొదటిసారిగా ప్రతి గ్రామంలోని ప్రతి నివాసానికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఈ నెల 19 నుంచి 24 వరకు జరుగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు హాజరయ్యే వివిధ దేశాల ప్రతినిధులకు ఈ ప్రాజెక్టు పనితీరు గురించి మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. పౌరసేవలను నేరుగా ప్రజలకే అందుబాటులోకి తేవడం, సామాన్యుడికి సాంకేతిక విప్లవ ఫలాలను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు టీ-ఫైబర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిపి ఐటీ శాఖ టీ-ఫైబర్‌గ్రిడ్‌ను ముందుకుతీసుకుపోతున్నది.













