మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నుంచి మరోసారి ఆహ్వానం లభించింది. 2022 జనవరి 17-21 మధ్య దావోస్- క్లోస్టర్స్ లో నిర్వహించే 2022 వార్షిక సమావేశంలో పాల్గొనాలని ఆ సంస్థ అధ్యక్షుడు బ్రెండీ లేఖ రాశారు. తెలంగాణను టెక్నాలజీ పవర్‌హౌజ్‌గా మార్చడంలో మీ నాయకత్వం, చిత్తశుద్ధి మంచి ఫలితాలను సాధిస్తున్నది అని లేఖలో పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు కోసం అత్యాధునిక సాంకేతికతల (ఎమర్జింగ్ టెక్నాలజీస్) వినియోగం అనే అంశంపై అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. సహకార మార్గాల ద్వారా భవిష్యత్తు నిర్మాణ సామర్థ్యాలపై విశ్వాసం కలిగించేందుకు అగ్రశ్రేణి రాజకీయ, వ్యాపార, పౌర సమాజ నాయకులు మరోసారి కలిసిరావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.













