Group 1: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
తెలంగాణలో నిరుద్యోగులు, ముఖ్యంగా గ్రూప్-1 అభ్యర్థులు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా వెలువడిన గ్రూప్-1 నోటిఫికేషన్ ఎన్నో మలుపులు తిరిగింది. నిరుద్యోగుల ఆశలు, ఆందోళనలు, వరుస కోర్టు కేసులు.. వెరసి ఈ నియామక ప్రక్రియ ఒక సవాల్‌గా మారింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం వెలువరించిన తీర్పు ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కనిపిస్తోంది.
గతంలో గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) తయారీలో నిబంధనలు ఉల్లంఘించారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, అభ్యర్థుల వాదనతో ఏకీభవిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేయాలని, మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం (Re-evaluation) చేయాలని ఆదేశాంచారు. నియమ నిబంధనల ప్రకారం కొత్త జాబితాను రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ తీర్పుతో అప్పటికే ఎంపికైన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం, ఇవాళ తుది తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, ఎంపికైన అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. TGPSC అనుసరించిన మూల్యాంకన విధానంలో తీవ్రమైన లోపాలు లేవని, నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రక్రియ జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున, మళ్లీ మొదటి నుంచి మూల్యాంకనం చేయడం వల్ల సమయం వృథా కావడమే కాకుండా, అభ్యర్థుల కెరీర్‌పై ప్రభావం పడుతుందని గుర్తించింది. కమిషన్ సమర్పించిన వివరాలను పరిశీలించిన తర్వాత, జనరల్ ర్యాంకింగ్ లిస్టులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తెలంగాణ గ్రూప్-1 ప్రస్థానం ఆది నుంచి అడ్డంకులతోనే సాగింది. 2022లో ఇచ్చిన మొదటి నోటిఫికేషన్ పేపర్ లీకేజీ కారణంగా రద్దయింది. ఆ తర్వాత మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. జీవో నెంబర్ 29 వివాదం, రిజర్వేషన్ల అమలు తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అశోక్ నగర్ వంటి నిరుద్యోగ అడ్డాలో నెలల తరబడి అభ్యర్థులు పోరాటాలు చేశారు. ఈ నియామకాలు కేవలం అభ్యర్థుల భవిష్యత్తు మాత్రమే కాకుండా, రాజకీయంగానూ పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రక్రియపై కోర్టు స్టేలు రావడం వల్ల పాలనాపరంగానూ ఇబ్బందులు ఎదురయ్యాయి.
తాజా తీర్పుతో దాదాపు 563 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివి, మెయిన్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు కోర్టు కేసుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ తీర్పు వారిలో నూతనోత్సాహాన్ని నింపింది. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో, ప్రభుత్వం తదుపరి ప్రక్రియను అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్స్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో గ్రూప్-1 నియామక ప్రక్రియ ఒక అత్యంత క్లిష్టమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. న్యాయపరమైన చిక్కులు వీడటంతో, పాలనలో కీలకమైన గ్రూప్-1 అధికారులు త్వరలోనే విధుల్లో చేరే అవకాశం ఉంది. ఇది కేవలం ఎంపికైన అభ్యర్థుల విజయమే కాదు, వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించే కీలక అడుగు.






