బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు :కేసీఆర్
బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని తెలిపారు. సంపద సృష్టించి, ప్రజలకు పంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. వ్యవసాయరంగం, వృత్తిపనులను నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరంతర విద్యుత్, రైతుబందుతో వ్యవసాయానికి నూతన ఉత్తేజం తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపారని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ప్రాంత నేతలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
గోదావరి జలాల వినియోగానికి మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో 12 లక్షల కొత్త ఆయకట్టు వచ్చిందన్నారు. దీంతో వెనుకబడిన జిల్లాల్లో వలసలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. తుమ్మిళ్ల, గట్టు, సదర్మాట్, ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి రైతుల కష్టాలు తీర్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుతో పాలేరులో కరువును తరిమికొట్టామని తెలిపారు.













