హైదరాబాద్లో ఘనంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. నాలుగో రోజు శ్రీవారికి నిర్వహించిన సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, అభిషేకసేవతో భక్తులు పులకించిపోయారు. తిరుమలలో నిర్వహించినట్లుగానే శ్రీస్వామివారి వక్ష స్థలంలో బంగారు అలమేలుమంగ, ప్రతిమకు పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం చేశారు. అనంతరం పసుపుతో శ్రీవారి వక్ష స్థలంలో ఉన్న మహాలక్ష్మీకి కూడా అభిషేకం చేశారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ వేంకటేశ సుప్రభాతం, గోవిందనామాలను పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.













