కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. మళ్లీ టెండర్లు
బీఆర్ఎస్ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నందునే సీఎం కేసీఆర్ అన్ని ఆస్తులు అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ మద్యం దుకాణాలను సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగానే టెండర్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వైన్ షాపులకు మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసు అధికారుల నుద్ధేశించి మాట్లాడారు. హైదరాబాద్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్, నగరంలోని వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని నిలదీశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, భూములు కొన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.













